19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం

By వై, వెంకటరత్నం

స్వాతంత్య్ర సమరంలో ప్రముఖ పాత్ర నహించి ఆంద్ర కేసరి గా పేరు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రిగా రాష్ర్ట ప్రగతికి కృషి చేసిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదినము ఆగష్టు 23వ తేదీన జరుపుకుంటున్న సందర్భమున వారిని స్మరించుకొనవలసిన ఆవస్యకత ప్రతి ఆంధ్రుడి పైన ఉన్నది. ప్రకాశంగారు వ్రాసిన `` నా జీవిత యాత్ర`` అనే పుస్తకంలో ఈ విధముగా ప్రస్తావించారు. ఆయన లో ఉన్న విప్లవ దృక్పధము హిమాలయాల కంటే ఎత్తుగా ఆయన కీర్తిని తీసుకెళ్ళి ఆంధ్రుల మనస్సులో చెరగని ముద్ర వేసింది. అదే విధముగా దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా నవ్యాంధ్ర జాతిపితగా వారిని శ్లాఘించారు. ప్రకాశం జిల్లాగా పేరు పెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఫిర్కా అభివృద్ధి పధకం పంచాయితీరాజ్ వ్యవస్ధకు నాంది పలికింది. జమిందారీ వ్యవస్ధ నిర్మూలనకు సూత్ర ధారిగా ఉండి పేద ప్రజల హృదయాన్ని దోచుకున్న ప్రకాశంగారి అడుగుజాడల్లో నడిచి వారి సిద్దాంతములను ఆచరణతో పెట్టి రాష్ట్రాభివృద్ది కి తోడ్పడవలసిన బాద్యత తెలుగువారి భుజస్కంధాలపై వుంది.

జీవిత సంగ్రహం

ప్రకాశం పంతులు గారు 1872లో ఒంగోలు జిల్లాలో వినోదరాయుడు పాలెం అనే గ్రామంలో జన్మించారు. వల్లూరు, ఆద్దంకి, నాయుడు పేట, ఒంగోలు, మరియు రాజమండ్రి మొదలగు ప్రదేశాలలో విద్యాభ్యాసం చేస్తూ నాటక రంగంలో కూడా అనుభవం సంపాదించారు. తర్వాత మద్రాసులో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1900 సంవత్సరం నుండి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్నారు. 1903 లో రాజమండ్రి పురపాలక సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1904 లో బారిస్టరు పట్టా కోసం ఇంగ్లాండు వెళ్లారు. 1916లో డా।। అనీబిసెంటు ప్రారంభించిన హోంరూల్ లీగ్ తో పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యక్రమములో మరియు స్వాతంత్ర్యోద్యమంలో 1916 నుండి చురుకుగా పాల్గొన్నారు. 1928లో సైమన్ కమీషను బహిష్కరించి తుపాకీ గుళ్లకు ఎదురుగా నిలిచి బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ఆంద్ర కేసరిగా పేరు తెచ్చుకున్నారు. 1930 లో దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1937 లో జమిందారీ నిర్మూలనకు కృషి చేసిన కమిటీలో వారు చక్కని పాత్రను నిర్వహించారు. 1940 లో ``విలేజ్ రిపబ్లిక్`` అనే వార్తా పత్రికను ప్రారంభించి తెలుగు మరియు తమిళ భాషలలో ప్రచురించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1946 లో మద్రాసు ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 1950లో కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీని స్దాపించారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి ఫలితముగా 1953 నవంబరు 1 తేదీల ఏర్పడిన ఆంధ్ర రాష్ర్టమునకు తొలి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. రాష్ర్టంలో మద్యనిషేధం ప్రవేశపెట్టిన ప్రప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారే. 1957 మే 20వ తేదీన ప్రకాశం గారు హైదరాబాదులో దివంగతులైనారు. వారి జీవిత చరిత్ర ప్రతి ఆంధ్రుని రాజకీయంగా, సాంఘికంగా స్ఫూర్తినిస్తూ వారి యొక్క సేవలను చిరస్మరణీయంగా ఉండే విధంగా చిరంజీవియై నిలిచింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved