17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోదనలు

By హెచ్, బ్రహ్మానంద

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పలు ప్రాంతాలలో యూనివర్సిటీలు, అకాడమీలలో, వాటి బయట, మేధావులు జరిపిన సునిశిత భాషా సాహిత్య పరిశోధనలకు స్థూలంగా పరిచయం

తెలుగులో పరిశోధన 19వ వతాబ్ధం చివర్లో వీరేశలింగంగారి తరంలో మొదలయింది. గిడుగు రామ్మూర్తి (1863-1940) గారి తరం ఆధునిక భాషా సాహిత్య పరిశోధనలకు కావాల్సిన నమూనాల్ని తయారు చేసి వుంచింది. మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్తి, రాళ్లబండి సుబ్బారావు, చిలుకూరి వీరభ్రదరావు, టేకుమళ్ల కామేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు, జయంతి రామయ్య పంతులు, కోరాడ రామకృష్ణయ్య, కుందూరి ఈశ్వరదత్తు ప్రభృతులు ఆరోజుల్లో అటు భాషారంగంలోను, ఇటు సాహిత్య రంగంలోను నిష్ణాతులు. కావ్యాలు, శాసనాలు, కైఫీయత్తులు, జానపద విజ్ఞానం, దేశివాజ్మయం, తులనాత్మక భాషా పరిశీలన, కవుల కథలు, గాథలు, సాహిత్యచరిత్ర అధ్యయనం ఆనాటి పండితులకు చాలా ఆకర్షకమైన విషయాలు. నిఘంటు పరిశోధన, మాండలిక పరిశీలన, పదప్రయోగకోశాల తయారీకి సంబంధించిన మౌలికమైన విచారణ రీతులు కూడా ఈ యుగంలోనే మొదలయ్యాయి. నిజమైన పరిశోధకులు దేశమంతటా ఒక దీక్షతో ఏ లాభాపేక్ష లేకుండా శ్రమించిన యుగమది. స్వాతంత్ర్యోద్యమం, జాతీయతా స్పృహ ఆనాటి వారికి ప్రేరణలయ్యాయి.

స్వాతంత్ర్యం రాకముందు మదరాసు, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉండగా తరువాతి దశకాల్లో యూనివర్శిటీలు భిన్న ప్రాంతాల్లో ఏర్పడటం, సాహిత్య అధ్యయనానికి, భాషాధ్యయానానికి ప్రత్యేకంగా ఆకాడమీలు ఏర్పడటం, పరిశోదనకు ఒక కొత్త చైతన్యాన్ని ఇచ్చాయి. దీనికి తోడుగా యూనిర్శిటీలకు, అకాడమీలకు బటయ ఆనాటి నుంచి ఈనాటి దాకా మేధావులు సునిశితమైన పరిశోధనలు చేస్తూనే వున్నారు. వీటన్నిటిని అతి స్థూలంగా పరిచయం చెయ్యటం ఈ వ్యాసోద్దేశం.

విజ్ఞాన రంగంలో పరిశోధనకు మానవీయ శాస్త్రాల్లో పరిశోదనకు ఒక ముఖ్య భేదం వుంది. విజ్ఞాన పరిశోదనలు సమాజంలోని పరిణామాల్ని సాధారణంగా రికార్డు చెయ్యవు. అలా కాకుండా మానవీయ పరిశోధనలు సాహిత్య భాషా విషయమూ ఇంతే - ప్రధానంగా సమాజాన్ని కేంద్రంగా కలిగినవి. అంచేత సమాజంలో వచ్చే మార్పు ఈ పరిశోధనల్లో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. ఈ భేదాన్ని గుర్తించి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత పరిశోధనారంగంలో ప్రధానంగా వచ్చిన మార్పులు చూద్దాం.

రెండు మార్పులు ముఖ్యంగా కనిపిస్తున్నాయి.

  1. పరిశోధనధ్యేయాల్లో స్పష్టత క్రమంగా పెరగటం.
  2. భాషా సాహిత్య మూలాలపై పరిశోధనలో కొత్త కోణాలు పరిణమించటం.

ఈ మార్పులు ఒక సంవత్సరంలో వచ్చినవికావు. ఎప్పుడైనా పూర్వులు కట్టిన మెట్లపైనే తరువాతి వాళ్లు పైపైకి పోగలుగుతారు. అంచేత సాహిత్య సృజనలోనైనా, విమర్శలోనైనా, పరిశోధనలోనైనా 'పూర్వపధి కృత్తులు' కనిపిస్తూ ఉంటారు. వారు వేసిన బాటల్లోనే తరువాతి వారు పయనిస్తూ, మార్గాన్ని వెడల్పు చేసుకొని, కొన్నిచోట్ల పిల్లదారులు తవ్వుకొని గమ్యాన్ని చేరుకొంటారు.

పేజి   1 |   2345678 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved