17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

నిత్యనూతనం నాటి స్త్రీల పాటలు....

ఆనాటి పాటల్లో ప్రాచుర్యం పొందినవి వివాహ సమయంలో పాడే పాటలు, నలుగు పాటలు, బూవంబంతి పాటలు, వరుస పాటలు, అప్పగింతల పాటలు మొదలైనవి పెళ్లి పాటలుగా ప్రసిద్ధిచెందాయి. బూవంబంతి పాటలు విందుభోజనం గురించి, వియ్యపురాలిని గేలిచేస్తూ పాడే పాటలు.

	
             ఏలాగు భోం చేతుము ఈ విందు మేము ఏలాగు భోంచేతుము......

ప్రతి అధరువును గేలిచేస్తూ పాడే పాట ఇది

వరుస పాటలు వదినెగారి మీద, వియ్యాలవారి మీద పాడేవి. కరుణరసం కూడిన పెళ్లి పాటల్లో ముఖ్యమైనవి అప్పగింతల పాటలు.

	కోడలు మీ సొమ్ము కొడుకు మీ సొమ్ము
	ఆడవారిని కన్న అలుసంతెనమ్మ
	సిరివంటి కోడలు మరువంటి కొడుకు
	మగువరో నీ భాగ్య మహిమమేమ్మ
	మా బాలకాదు - మీ బాలసుమ్మి
	మెల్లగా నేర్పుతో పని నేర్వవచ్చు.... 

అంటూ కూతుర్ని అత్తగిరికి అప్పగిస్తూ ' ఇకనుంచి మీ అమ్మాయి అని, ఇంటి పనులు నెమ్మదిగా నేర్పుతో నేర్పించుకోమని' చెబుతూ కన్నీటితో వీడ్కోలు పలుకుతుంది. అలాగే ఎన్నో నీతి బోధలు కూతురికి చెబుతుంది. ఈ అప్పగింతల పాటలు నాటి కొన్ని చిత్రాల్లో చిత్రీకరించారు. అవి ఎంతో ప్రసిద్ధి చెందిన పాటలు.

	'పోయిరావే మా తల్లి! పోయిరావమ్మా!' 

	'' వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా!
	చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా!''

	' వేయి శుభములు కలుగునీకు
	పోయిరావే మరదలా!...'

ఇలా ఎన్నో పాటలు చలనచిత్రాల్లోనూ, ఇటు లలిత గీతాల్లోనూ అప్పగింతల పాటలు ప్రసిద్ధి చెందాయి. వివాహ సమయంలో పాడే అప్పగింతల పాటలు తల్లిదం్రడులతో పాటు అక్కడ వున్నవారంతా కంట తడి పెట్టకమానరు. అసలు ఆ సన్నాయి మేళంతో పాడే పాటలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. పెళ్లిలో తెలియకుండానే చిన్న పెద్ద అందరూ బాధతో విలపించే పాటలు అవి. వినోదానికి అలకపాటలనీ, చెండ్ల పాటలనీ పాడుతుంటారు.

ఇక దశావతారాలను పాటల రూపంలో స్ర్తీలు పాడుకునేవారు. చిన్న పిల్లలు గొబ్బి తట్టేటప్పుడు కూడా పాడే ఈ దశావతారాల పాట నేటికీ వినిపిస్తుంది.

	కుప్పి కుచ్చుల జడల వేయవే
	ఓ యమ్మ నన్ను కృష్ణావతారుండనవే!
	కుప్పికుచ్చుల జడలు వేసెద
	గోపాలకృష్ణ నిన్ను 
	కౄష్ణావతారుండనెద...

ఇలా దశావతారాలు పాడుకునేవారు. నువ్వి పాటల్లో..

	సువ్వి సువ్వీ సువ్వాలమ్మ!
	నవ్వుతు జానకి నందును గనియె....!
	నవ్వి యనుచు పాడరమ్మా!
	సుదతులారా... సువ్వి యనుచు పాడరమ్మ!

ఇవేకాక అచ్చన గాయలు, సీతాదేవి వేవిళ్లు, సత్యాద్రౌపదీ సంవాదం, చెంచీత పాటలు అనేకం ప్రచారంలో వున్నాయి. ఆనాటి స్త్రీల పాటల్లో భక్తి, కరుణ, హాస్యశృంగార, వీర రసాలతో నిండివుండేవి. ఆ పాటలు నేడు మచ్చుకి కానరావడంలేదు. ఆ పాటలు పాడేవారు తక్కువైనారు. యంత్రికమైన నేటి జన జీవన నిత్యకృత్యాల్లో టీవీ చూడడం, ఉద్యోగాలకెళ్లడం, ఇతర వ్యాపకాల్లో మునిగితేలుతున్నారు నేటి తరంవారు. ఆనాడు ఇళ్లల్లోనే కాదు రేడియోల్లోనూ వినిపిస్తుండేవి. నేటి యువత ఫాషన్లంటూ, పాప్ మ్యూజిక్ లంటూ వెంటబడే బదులు ఇళ్లల్లో అమ్మమ్మల నోటిమీదుగానైనా ఆనాటి ఆ పాత మధురగీతాల్ని ఆలకించి, నేర్చుకుంటే రాబోయే తరాలవారికి మార్గం వేసిన వారవుతారు.

సంగీత సాహిత్య సమ్మేళనాలైన ఆనాటి పాటలు లౌకిక జ్ఞానాన్ని, భక్తిభావాన్ని కురిపిస్తూ పరవశంతో పాడుకునేలా ఉండేవి. అంతేకాదు భారతీయ సంస్కృతి, నాగరికత, ప్రాచీన సంప్రదాయాలకు నిలయమై వుండేవి ఆనాటి పాటలు, సాంఘిక జీవనానికి, కుటుంబ జీవితానికి ప్రతిబింబాలైన ఈ మధురమైన స్త్రీల పాట తిరిగి పురర్జీవింపచేయాల్సిన అవసరం నేటి తరానికి ఎంతైనా వుంది. పాడాలనుకునేవారికి సాహిత్యపరంగా వాటినన్నిటినీ ఒకచోట క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో అందిస్తే బాగుంటుంది. ఎక్కడో గ్రంథాలయాల్లో తప్ప దొరకని ఈ అమూల్య పద కవితా సంపద వెలికీతీయాల్సిన అవసరం ఎంతైనా వుంది. సులభ రాగాలతో అల్లబడిన ఈ పాటలు ఎప్పటిక అజరామాలు.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved