22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

శాస్త్ర సాంకేతిక రంగం - జాతీయ విధానం

దేశంలో శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధి స్వాతంత్రానంతరం తీసుకోబడిన చర్యలు, శాస్త్ర సాంకేతిక శాఖ అవిర్భావ విషయాలు

భారతదేశం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించడంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల పాత్రను దేశ ప్రప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గుర్తించారు. 1958లో తొలిసారిగా జాతీయ శాస్త్ర విజ్ఞాన విధాన తీర్మానాన్ని ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

దేశంలో శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించడం, వినూత్నమైన ఆలోచనలతో ఈ రంగంలో కృషి చేస్తున్న వారికి తోడ్పాటు నందించడం, వీటికి మించి శాస్త్రీయ పరిజ్ఞానం, పరిశోధనా ఫలితాలు దేశంలోని ప్రజలందరికీ ఉపయోగపడేటట్లు చూడడం మొట్టమొదటి జాతీయ శాస్త్ర విజ్ఞాన విధానం ముఖ్య లక్ష్యాలుగా ప్రకటించారు.

విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం దేశీయ అవసరాలకు అనుగుణంగా సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నప్పటికీ దేశాభివృద్ధిలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన ఆవశ్యకతను గుర్తించారు. ఫలితంగా 1983లో సాంకేతిక పరిజ్ఞాన ప్రకటనను విడుదల చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల జీవన విధానంలో గుణాత్మక మార్పులు తీసుకుని వచ్చేందుకు మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్నదే ఈ ప్రకటన ముఖ్య లక్ష్యం. సాంకేతికంగా పురోగతి సాధించడం వలన అనేక సమస్యలు పరిష్కారమడంతోపాటు దేశ సమైక్యత భద్రతలకు ఢోకా ఉండదు. సాంకేతికంగా స్వయం సమృద్ధి సాధించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, సాంప్రదాయపరమైన కౌశాలలను, పరికరాలను ఆధునీకరించడం ద్వారా వాణిజ్యపరమైన పోటీని పెంపొందించడం, కనిష్ఠ మూలధనంతో గరిష్ట అభివృద్ధిని సాధించడం, ఇంధన వనరులను కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ మొదలైనవి సాంకేతిక పరిజ్ఞాన ప్రకటన ముఖ్య లక్ష్యాలు.

1971లో శాస్త్ర, సాంకేతిక శాఖ ఏర్పాటైంది. నూతన అంశాలలో పరిశోధనలను ప్రోత్సహించడం శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించడం, సమన్వయపరచడం, వాటిని ప్రోత్సహించడంలో ఈ శాఖ ఒక నోడల్ వ్యవస్థలా పనిచేస్తుంది.

శాస్త్ర, సాంకేతిక విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం 1983 జూన్ లో ఆచరణ కమిటీని (Technology policy implementation Committee)ఏర్పాటు చేసింది. కాలపరిమితి పూర్తి అయిన మీద ఈ కమిటీ, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్, ఎసెస్ మెంట్ కౌన్సిల్ (Technology Information Forecasting and Assessment Council) అనే ఒక స్వయం ప్రతిపత్తి గల మండలిగా రూపు దాల్చింది. ఈ మండలి శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. టెక్నాలజీ రంగంలోని శక్తి, సామర్ధ్యాలను మరింత పటిష్టం చేయడం, మదింపు చేయడం, విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి సలహాలనివ్వడం కోసం ఈ మండలిని ఏర్పాటు చేశారు.

2003 జనవరి 3 నుంచి జరిగిన ఐదు రోజుల 90వ భారత శాస్త్ర విజ్ఞాన మహాసభను ప్రారంభిస్తూ అప్పటికి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి 2003 నూతన శాస్త్ర, సాంకేతిక విధానాన్ని ఆవిష్కరించారు. '' గత శతాబ్దపు అంతిమ దశాబ్దాలలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంభవించిన అద్భుతమైన మార్పులకు, నూతన శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్ళకు లభించే అవకాశాలకు భారత్ సమర్ధవంతంగా ప్రతిస్పందించగలదని తేలతెల్లమైందని'' విధాన పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా శ్రీ వాజ్ పేయి అన్నారు.

నూతన విధానంలోని ముఖ్యాంశాలు

    సంప్రదాయ శాస్త్ర విజ్ఞానాన్ని పరిరక్షించి నవీకరించేందుకు ఆధునిక శాస్త్ర, సాంకేతిక పద్ధతులను పూర్తిగా వినియోగించుకోవాలన్నదే 2003 నూతన శాస్త్ర సాంకేతిక విధాన ప్రధాన లక్ష్యం.
  1. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో ప్రజా బాహుళ్యానికి పౌష్టికాహారం, రక్షిత నీరు, ఆరోగ్య భద్రత, మెరుగైన పర్యావరణాన్ని కల్పించాలి.
  2. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించాలి.
  3. విశ్వవిద్యాలయాలలో శాస్త్ర, సాంకేతిక విభాగాలను పటిష్ట చేయాలి.
  4. శాస్త్రీయ పరిశోధన, ఇంజనీరింగ్ సంస్థలను బలోపేతం చేయాలి.
  5. అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే శాస్త్ర, సాంకేతిక నైపుణ్య కేంద్రాలను నెలకొల్పాలి.
  6. మెరుగైన పరిశోధనల కోసం వివిధ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో శాస్త్రవేత్తల వినిమయతను, చలనాన్ని పెంపొందించాలి.
  7. పదో ప్రణాళికాంతానికి స్థూల దేశీయోత్పత్తిలో కనీసం రెండు శాతం నిధులను శాస్త్ర, సాంకేతిక రంగానికి కేటాయించాలి.
  8. మేధావుల వలసను అరికట్టాలి.

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved