17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కాలంతో మారుతున్న దక్షిణాది నాట్య సంప్రదాయం

By డి, వేణుగోపాల్

భరతముని నాట్య శాస్త్రానికి పూర్వమే జీవం పోసుకున్న దక్షిణాది నాట్య కళ ఎగుడుదిగుడులను ఎదుర్కొంటు కాలానుగుణంగా కొత్త సంగీత సాహిత్యాలను ఏర్పర్చుకుంటు పురోగమనం సాగిస్తూనే వుంది

నాట్యానికి జీవం భావం. భావం, రాగం, తాళం కలిస్తే భరతం. అంటే నటన, లేక నాట్యం. ఆంధ్రప్రదేశంలో కూచిపూడి, తమిళదేశంలో భరతనాట్యం, కన్నడ దేశంలో యక్షగానం, కేరళ దేశంలో కథకళి ఇలా నాల్గు సంప్రదాయాలుగా దక్షిణదేశంలో ప్రస్తుతం ఈ నాట్యకళ ప్రసిద్ధమైంది.

భరతముని నాట్య శాస్త్రం, కర్ణాటక సంగీతం నాట్య సంప్రదాయానికి ప్రధానాంశాలు. ఆహార్యం, అభినయం, నర్తన విధానాలలో మాత్రం కొన్ని తేడాలు కనబడుతున్నాయి.

భరతుని నాట్య శాస్త్రానికి పూర్వమే ఆంధ్ర ఋషి అయిన నందికేశ్వరుడు అభినయ దర్పణం అనే ఉత్కృష్ట శాస్త్ర గ్రంథాన్ని రచించాడనీ, దానిని అనుసరించే ధాన్యకటకం, భట్టిప్రోలు, ఘంటసాల, గోలి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ మొదలైన స్థూపాలలో నాట్య శిల్పం చెక్కారనీ శ్రీ అడవిబాపిరాజు పరిశోధించి వెల్లడించాడు. తంజావూరును పరిపాలించిన మహారాష్ట్ర రాజులు తెలుగు సాహిత్యాది లలిత కళలను విశేషంగా ఆదరించిన సంగతి అందరికీ తెలిసిందే. శరభోజీ ఆస్థాన గాయక నర్తకులు అయిన చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు, శివానంద అనే నలుగురు నట్టువనారు సుబ్బరాయుని కుమారులు. ఈ రోజున భరత నాట్యం పేరుతో పిలుస్తున్న నాట్యరూపాన్ని రూపొందించింది వీరే.

ఆరు దశాబ్ధాలకు ముందు నా చిన్నతనంలో కూచిపూడి వారి భరతనాట్యం అనే పిలిచేవారు. భరత నాట్యానికి పాడే తెలుగు పాటలన్నింటినీ తమిళంలోకి మార్చుకొని, భరతనాట్యం తమదే అని తమిళుల ముద్ర వేయించుకున్నారు.

పరాయి పాలనలో పతనం - పునరుద్దరణ

బ్రిటిష్ పరిపాలననలో భారతదేశంలో లలిత కళలన్నీ కళా విహీనం అయిపోయాయి. వ్యక్తిగత హీన ప్రవృత్తులకు దాసోహం అయ్యాయి. 1930 నాటికి దేవాలయాల నుండి దేవదాసీలను బహిష్కరిస్తూ శాసనసభలలో బిల్లు వచ్చింది. గురుపరంపరగా ప్రాప్తించిన దేవదాసీ నృత్య గానాభినయ కళలు ఆనాటి ఉదాత్త గుణ సంపత్తిని కోల్పోయాయి. రాజ సభలనుండి భరతశాస్త్ర విద్య కేవలం వినోదంగా దిగజారి వీధికెక్కింది. దేవదాసీలకు భోగంవారనీ, వారి నాట్యానికి భోగం ఆటనీ పేరు పడిపోయింది. శ్రీ మంతుల ఇళ్ళల్లో పెళ్ళిళ్లకు ఆడే నాట్యాలుగా భోగం మేళాలు తయారయ్యాయి.

తమిళదేశంలో సంఘ బహిష్కరణకు గురైన నాట్యకళకు తిరిగి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కలిగించినవారిలో ముఖ్యులుగా శ్రీ ఇ. కృష్ణఅయ్యర్, శ్రీమతి రుక్మిణి అరండేల్, శ్రీమతి కళానిధి నారాయణ్లను చెప్పుకోవాలి.

రుక్మిణి అరండేల్ స్థాపించిన కళాక్షేత్రం ఈనాడు దేశంలోనే ప్రధాన సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ నుంచే చంద్రశేఖర్, ధనంజయన్, అడయార్ లక్ష్మన్ వంటి సుప్రసిద్ధ నాట్యకళావేత్తలు ఆవిర్భవించారు.

పేజి   1 |   23456 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved