22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

జాతీయ రైతాంగ ఉద్యమం - ఆవిర్భావ వికాసాలు

By ఎన్, రంగా

స్వాతంత్ర ఉద్యమ కాలంలో మొదలై, స్వాతంత్రానంతరం కొనసాగిన రైతు ఉద్యమ విశేషాలు

1918లో మా ఊరు నిడుబ్రోలులో కమ్మవారి దక్షిణ భారత మహాసభ జరిగింది. వారంతా పట్టాలున్న రైతులు. వారిలో చాలామంది నిరక్షరాస్యులు. తుమ్మల సీతారామమూర్తి ఆ సభలోనే తొలి ప్రసంగం చేశారు. ఒక రాష్ట్రస్థాయి రైతుల మహాసభలో నేను ప్రధాన ప్రసంగం చేయటం అదే మొదటిసారి. ఈ మహాసభ అనంతరం మిగిలిన నిధులతో ఒక తెలుగు వారపత్రిక పెట్టాలని నిర్ణయించారు. దానికి 'రైతు పత్రిక' అని పేరు పెట్టాలన్న నా సూచన అందరి ఆమోదాన్ని పొందింది. బీహారులోని చంపారణ్ రైతులు, గుజరాతులోని కైరా, బొర్సాద్ రైతుల హక్కుల సాధనకు మహాత్మాగాంధీ సాగించిన పోరాట రీతి నన్ను ప్రత్యేకించి ప్రభావితం చేసింది.

ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రాల్లో అత్యంత ఉన్నత స్థాయిలో ప్రవీణుడనై 1923లో నేను అక్స్ ఫర్డ్ నుంచి తిరిగి వచ్చాను. అక్కడ బ్రిటీష్ కమ్యూనిస్టులతో, సోషలిస్టులతో ముఖ్యంగా గిల్డ్ సోషలిస్టులతో సాహచర్యం ఉండేది. యూరప్ లో రైతు సహకార సంస్థల గురించి అధ్యయనం చేశాను. అయితే నేను వచ్చేనాటికే రైతుల పన్నుల నిరాకరణోద్యమం తగ్గుముకం పట్టినట్టు గమనించాను. నేను ఇంగ్లండ్ నుంచి రాగానే ఎందరో కాంగ్రెసు వాదులు నా చుట్టూ చేరారు. రైతు పత్రికలో ప్రచురితమైన నా వ్యాసాలు వారినెంతో ప్రోత్సాహపరిచాయి. ఒక కిసాన్ రాజకీయ వేదికను ఆరంభించి కాంగ్రెసు రాజకీయ ధ్యేయాలు, ఖాదీ, కుటీర పరిశ్రమలు వంటి గాంధీవాద నిర్మాణ కార్యక్రమం, రైతుల ఇతర డిమాండ్లు ప్రాతిపదికగా రానున్న ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టవలసిందిగా నా మిత్రులందరూ నన్ను కోరారు. సి.ఆర్.దాస్, మోతీలాల్ కమిటీ శాసన సభల ప్రవేశానికి అనుకూలించినప్పటికీ, ఆంధ్ర కాంగ్రెసు నాయకులు మాత్రం ''కౌన్సిళ్ళ బోయ్ కాట్'' ఛాందస వైఖరులను విడనాడటానికి తిరస్కరించారు. 1923 డిసెంబర్లో కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆహ్వాన సంఘ సభ్యులలో ఒకడిగా నన్ను ఎన్నుకొన్నారు.

శాసన సభల కాంగ్రెస్ ప్రవేశంపై నిషేధాన్ని ఈ మహాసభలో కొనసాగించలేదు. ప్రముఖ గాంధేయవాది సీతారమాశాస్త్రి ఆశీస్సులతో రైతు రాజకీయ వేదిక తరపున అభ్యర్థుల్ని నిలబెట్టాలని మేం నిర్ణయించాం. మద్రాసు కౌన్సిల్ కు ముగ్గురిని, కేంద్ర శాసన సభకు ఒకరిని పోటీలో నిలబెట్టాం. గుంటూరు జిల్లా నుంచి రాష్ట్ర శాసన సభకు ఇద్దరు, కేంద్ర శాసన సభకు ఒకరు ఎన్నికయ్యారు. మౌంట్ - ఫోర్డ్ రాజ్యాంగ సంస్కరణల వల్ల పెరిగిన ఓటర్లలో అత్యధికులు రైతులే. వారంతా కాంగ్రెసు పక్షాన నిలిచారని ఈ ఎన్నికలు నిరూపించాయి. గాంధీజీ, కాంగ్రెసులోని ఇతర ముఖ్య నాయకులు ఇంకా జైళ్ళలోనే ఉన్నప్పటికీ ఈ ఫలితాలు లభించాయి. కాంగ్రెసు నాయకులు జైళ్ళలో ఉండటం వల్ల ఏర్పడిన ఖాళీని రైతు వేదిక ప్రతినిధులు భర్తీ చేయడం ఇక్కడ గమనార్హం. మా జిల్లాలో నాలుగు స్థానాలలో బ్రిటీష్ అనుకూల జస్టిస్ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే పొందగలిగింది. భూమిశిస్తు తగ్గింపు, కుటీర పరిశ్రమల అభివృద్ధి కుల ప్రాతిపదిక కాకుండా వర్గ ప్రాతిపదికపై గిల్డు తరహా సహకార నిర్మాణం, అస్పృశ్యతా నివారణ, హరిజనులకు ( అప్పుడు వారిని పంచములు, లేదా ఆది ఆంధ్రులు అనేవారు) ఇళ్ళ స్థలాలు, భూములు పంచడం, జాతీయ భావాలనుకూల విద్య మొదలైనవి మా రైతు వేదిక ప్రధాన ఆశయాలు.

పేజి   1 |   23456 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved