22 నవంబరు, 2017, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

భారతీయ సినిమాకి తెలుగు బీజం

By ఇంటూరి, వెంకటేశ్వరరావు

మనదేశ గడ్డమీద సినిమా పరిశ్రమకు ప్రాణ ప్రతిష్ట చేసినవాడు ఒక తెలుగు బిడ్డ - రఘుపతి వెంకయ్య. మెట్టమొదటి ప్రదర్శన శాఖను స్థాపించింది ఆయనే

తెలుగు సినిమా పరిశ్రమ గత చరిత్రను సింహావలోకనం చేసే ముందు భారత దేశంలోని సినిమాకు మూల పురుషుడెవరో తెలుసుకోవాలి.

భారతీయ సినిమా మూలపురుషులు

చరిత్ర లోతుల్లోకి తొంగిచూస్తే అసలు భారతదేశ సినిమా పారిశ్రామిక సౌధానికి 1910లో పునాదిరాయి వేసినవాడు ఆర్.జి. టోర్న్. ఆయన '' భక్త పుండరీక'' చిత్రాన్ని నిర్మించాడు. విదేశీ సినిమా సాంకేతిక శాస్త్రజ్ఞుల సహకారంతో ఆ చిత్రం నిర్మింపబడడంచేత నాటకరంగ స్థలిమీద పేరొందిన నాటకాన్ని యధాతధంగా (కెమేరా, నటీనటుల కదలికలు ఏమి కాకుండా) వెలుగు నీడల్లోకి ఎక్కించడం చేత టోర్న్ '' భారత సినిమా జనకుడు'' అని పిలవబడటానికి నోచుకోలేకపోయాడు. ఈ పేరుతో పిలవబడే గౌరవం 1913లో '' రాజా హరిశ్చంద్ర'' చిత్రం తీసిన దాదా సాహెబ్ ఫాల్కేకు దక్కింది. విదేశీ సినిమా సాంకేతిక శాస్త్రజ్ఞుల సహాయం లేకుండా ఫాల్కే యీ చిత్రాన్ని తీసి విశ్రుతి కెక్కాడు చంద్రమతి పాత్రను పోషించడానికి ఎంత ప్రయత్నించినా ఒక స్త్రీ మూర్తి దొరకక పోవడం చేత సోలంకి అన్న ఒక మగాడు ( ఆడ వేషాలు వేసి, విశ్రుతి కెక్కిన మన స్థానం నరసింహారావు లాంటివాడు) యీ పాత్రను పోషించవలసి వచ్చింది.

మొదటిసారి సినిమా వేసింది తెలుగు వారే

టోర్న్, పాల్కేల కంటే ముందు మన దేశ గడ్డమీద సినిమా పరిశ్రమకు ప్రాణ ప్రతిష్ట సలిపిన వాడు ఒక తెలుగుబిడ్డ. ఆయన పేరు రఘుపతి వెంకయ్య. వాళ్లిద్దరు చిత్ర నిర్మాణంతో ప్రారంభిస్తే వెంకయ్య చిత్ర ప్రదర్శన శాఖను నెలకొల్పి, దాని ద్వారా సినిమా పరిశ్రమకు ప్రాణవాయువు నిచ్చాడు.

1909లో - బందరు వాస్తవ్యుడయిన వెంకయ్య మద్రాసులోని మౌంట్ రోడ్డు మీదున్న 161 నెంబరు ఇంట్లో ఒక ఫోటో స్టూడియోను నడుపుతుండేవాడు. ఒకనాడు ఆయన మద్రాసు మెయిలు పత్రిక తిరగేస్తూంటే '' క్రోనోమెగఫోను'' అన్న ఒక సినీమెటోగ్రఫ్ యంత్రం కనిపెట్టబడ్డదని, పిక్చరు ప్రాజెక్టు అయ్యేటప్పుడు '' రికార్డెడ్ డిస్క్'' సాయంతో దానిలో శబ్దం వెలువడుతతందని ఆయన తెలుసుకున్నాడు. ఇతర పరికరాలతో కూడుకున్న ఈ యంత్రం సృష్టికర్తలు లండన్లోని గౌమౌంట్ కంపెనీ అధినేత అని, బుకింగ్ హాం రాజ భవనంలో వీరు మొట్టమొదటి ప్రదర్శన నిచ్చారని, ప్రదర్శన చాలా సంతృప్తికరంగాను, విజయవంతంగానూ నడచిందని ఆ వార్తలో ఉంది. అనుక్షణం కొత్త పంధాలు తొక్కడానికి, కొత్త ప్రయోగాలు సలపడానికి అభిలషించే వెంకయ్య తన ఫోటో స్టూడియోను తాకట్టు పెట్టి తెచ్చుకున్న 30,000 రూపాయలతో ''క్రోన్ మెగఫోన్'' ఎక్విప్మెంటును కొని, ఒక డేరా సినిమాను ఏర్పాటు చేసుకొని పొట్టి చిత్రాల (షార్ట్ ఫిల్మ్) ప్రదర్శనల నిస్తూ మన దేశంలోనే కాక సిలోన్, బర్మా మొదలయిన దేశాలలో కూడా పర్యటించాడు. ఆయన ప్రదర్శించిన పొట్టి చిత్రాలన్నీ ఆంగ్ల భాషలో ఉన్నాయి.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved