19 నవంబరు, 2017, ఆదివారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

తెలుగు సినిమాకు పేరు తెచ్చిన సెల్యులాయిడ్ కావ్యాలు

By ఇంటూరి, వెంకటేశ్వరరావు

1931లో టాకీయుగంలోకి అడుగిడిన తెలుగు చిత్రసీమకు ఆద్యులను స్మరించుకుంటూ 1992 వరకు వచ్చిన సినిమాల విశ్లేషణ

1931లో సినిమా మూగ చిత్రయుగం నుంచీ శబ్ధ చిత్ర యుగంలోకి అడుగెట్టింది. కాలానుగుణ్యమైన పరిణామాలు సినిమా రంగంలో కూడా చోటుచేసుకున్నాయి.

టాకీ యుగం

భారత దేశంలోని ప్రధమ శబ్దచిత్రం ''ఆలం ఆరా'' హిందీ భాషలో రూపొందింది. ఇది 1931 మార్చి 14వ తేదీ విడుదల అయ్యింది. తెలుగు తమిళ భాషల్లో వెలువడ్డ ప్రధమ శబ్ద చిత్రాలు బొంబాయిలోని ఇంపీరియల్ ఫిల్మ్ స్టూడియోలో రూపు తీసుకున్నాయి. అంతవరకు మూగ చిత్రాలలో రిఫ్ లెక్టర్ బాయ్ నుంచి డైరెక్టరు వరకు పనిచేసి, విశేషానుభవం గడించిన హెచ్. యం.రెడ్డి ఈ రెండు చిత్రాలకు - అంటే తెలుగు '' భక్త ప్రహ్లాద''కు ఆరవం ''కాళిదాసు''కు దర్శకత్వం వహించాడు. భక్తప్రహ్లాదలో మునిపల్లె సుబ్బయ్య హిరణ్యకశివుడు గాను, సురభి కమలాబాయి లీలావతిగాను నటించారు. ఈనాడు సుప్రసిద్ధ చిత్ర నిర్మాతగా, దర్శకుడిగా రూపొందిన ఎల్.వి. ప్రసాదు ఈ చిత్రంలో చండామార్కుల వద్ద చదువుకునే మొద్దబ్బాయి వేషం వేసి, తెలుగు చిత్ర సీమలో ప్రధమ హాస్య నటుడయ్యాడు. హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించాడు. సినిమాలలో అగపడాలనే మోజుమీద కొందరు నాటకరంగ నటీనటులు ఆంధ్రదేశం నుంచి వెళ్లి, యీ చిత్రంలో పాల్గొన్నారు. చిత్ర నిర్మాణ వ్యయం 20,30 వేల రూపాయల కంటే మించలేదు. షూటింగు కాల్ షీట్లు కూడా యిరవయి, ముప్పయి రోజులకు మించలేదు.

75 ఏళ్ళు నిండిన చిత్రరంగం

1931 '' భక్త ప్రహ్లాద''తో ప్రారంభమయిన తెలుగు సినిమా పరిశ్రమకు 2006 లో 75 ఏళ్లు నిండాయి. ఈ 75 ఏళ్లలో తెలుగు సినిమా పరిశ్రమ - చరిత్ర దృష్టితో చూస్తే అనేక పరిణామాలను చవిచూసింది.

రాసిరీత్యా చూస్తే తెలుగు సినిమా పరిశ్రమ ముందడుగు వేస్తోంది. కాని వాసి పరంగా అవలోకిస్తే అది వెనక్కు పోతోంది అని బుద్ధిమంతుడయిన ప్రతివాడు ఒప్పుకోక తప్పదు. అయితే యీ పురోగమన తిరోగమనాలు కాలాన్ని అనుసరించి జరుగుతున్నాయని తెలుసుకోవాలి.

తెలుగు సినిమా పరిణామాలలో చెప్పుకో దగ్గది వ్యాపారం పాలు హెచ్చుకావడం, శిల్పం పాలు తక్కువ కావడం. వ్యాపారం ఎప్పుడయితే కళను కాలితో తన్నిందో అప్పటి నుంచి కథాబలం తగ్గు ముఖాన్ని పట్టి, తారాబలం తతంగం హెచ్చింది.


SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved