17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

కూచిపూడి నాట్య సంగీతం-సాహిత్య రచన

యక్షగానం

17వ శతాబ్ధం నాయకరాజుల కాలంలోనే సంగీత సాహిత్యాలలో ఒక అపూర్వమయిన పరిణామం యక్షగాన రచన[1 ]. ఈ రచనా విధానం 19వ శతాబ్దం వరకు సాగుతూనే వచ్చింది. శ్రీ నారాయణతీర్ధులవారు సంస్కృతంలో రచించిన శ్రీ కృష్ణ లీలా తరంగిణి యక్షగానమే . శ్రీ నారాయణ తీర్థులవారు తెలుగులో పారిజాతాపహరణం యక్షగానం రాసినా దాని పూర్తిపాఠ్యం అలభ్యం. శ్రీ నారాయణ తీర్థులవారి తరంగాలు భక్తిజ్ఞాన వైరాగ్యాలకు నిక్షేపాలు. 'బాలగోపాలా 'తరంగం, 'నీలమేఘ శరీర' మొదలైన తరంగాలు కూచపూడి నాట్యశైలికి నికషాలు.

శ్రీ సిద్దేంద్రయోగి నారాయణ తీర్థులవారి శిష్యుడని చెప్తారు. జీవిత చరిత్రలు ఇద్దరినీ ఒక్కలాగే వుంటాయి. యిద్దరూ సన్యాసులే. ఇద్దరూ రాసింది తెలుగులో పారిజాతాపహరణం యక్షగానమే. ఈనాడు భామాకలాపం పేరుతో ప్రచారం అయింది. కూచిపూడివారి నాట్యశైలిలో భామాకలాపానికి వున్నంత ప్రాధాన్యం తరంగ నృత్యానికీ వుంది. ఈ కారణాలవల్ల సిద్దేంద్రుడు, నారాయణ తీర్థులూ ఒకరేనేమో అనే అనుమానం వస్తుంది.

యక్షగాన రచయితలలో మేలట్టూరి వెంకటరామశాస్త్రి 'ప్రహ్లాద' నాటకం సుప్రసిద్దమైంది. కూచిపూడివారి నాట్యశైలిలో సిద్దేంద్రుని భామమకలాపం ప్రదర్శనకి పూర్వం ప్రధాన అంశములు కౌత్వం, శబ్దం, అంతకు పూర్వ రచనలు ప్రబంధం యిత్యాదిగా వైయక్తికి నాట్యమే ప్రధానమైనదని ఊహించవచ్చును. అంతవరకూ కూచిపూడి నాట్యం దేవస్థానాలకు, రాజాస్థానాలకు అంకితమై వుంది. భామాకలాప ప్రదర్శన ద్వారా ప్రజాబాహుళ్యానికి చేరుకుంది. తరువాత కాలక్రమేణా గొల్లకలాపం, రామనాటకం, ఉషా పరిణయం, శశిరేఖా పరిణయం మొదలైన నృత్య నాటకాలు ప్రదర్శించడం జరిగింది. కూచిపూడి వంశస్థులైన - మేలట్టూరులో స్థిరపడ్డ- కాశీనాథయ్య, నారణకవి, వేంకటరామశాస్త్రి మొదలైనవారు రూపొందించిన శబ్ధాలు దేవతాపరంగాను, రాజాంకితాలుగానూ కూడా ఉన్నాయి. కౌత్వం దేవతాపరమైనది. అతి ప్రాచీన రచన - ప్రబంధం. వీటిపై శ్రద్ద తగ్గి యక్షగాన ప్రదర్శనకే తమ నాట్యశైలిని మలచుకోవడం జరిగింది. యక్షగానంలో నాట్యానికి స్థానం వున్నా అది నాట్య ధర్మికన్నా లోకధర్మినినే ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా కూచిపూడి నాట్యం భాగవతమేళ పద్ధతికి కొంతదూరం అయింది.

ఇక దక్షిణాది నాట్య సంగీతం కళాపరంగా మహోన్నత పరిణామం పొందింది. నాటికి దేవాలయాలలో చేయబడుతున్న దేవదాసి నాట్యం ఒక పూజావిధిగా పరిణమించింది. రాజాస్థానాలలో నాట్యకత్తెలు చేసే నాట్యంలో ప్రభువులను స్తోత్రం చేయడం కోసమే ప్రధానమయిన సలాం శబ్ధాలు వంటివి రచింపబడ్డాయి. ఈ సమయంలో కళపరమైన ఉత్తమ సంగీత రచనలు అవసరం అయ్యేయి. ఆ మహాత్కార్యం, తంజావూరి సోదరులు పొన్నయ్య, చిన్నయ్య, వడివేలు, శివానందం అనే సోదరులవల్ల జరిగింది.


1. యక్షగాన రచన 12వ శతాబ్దం నుండి వున్నట్టు చెప్పుకొన్నా అది కేవలం గానరూపమేగాని నృత్య నాటకరూపంకాదు.

పేజి   12 |   3 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved