17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

హరిత విప్లవం-ప్రాంతాలవారీగా వివిధ పంటలు, ఉత్పాదకతలలో మార్పులు

By సి, రాజేశ్వర రావు

వరి, నూనె గింజలు, చెరకు, పొగాకు పంటల ఉత్పాదకత, విస్థీర్ణాలలో హరిత విప్లవం, ఆ తరువాత కాలంలో వచ్చిన మార్పుల గణాంక వివరాలు

వరి ప్రాధాన్యం

రాష్ట్రంలో సగటు సాగు భూమిలో 27 శాతం భూమిలో వరి పంట పండించడం జరుగుతున్నది. ఇది రాయలసీమలో 12 శాతం, తెలంగాణాలో 20 శాతం ఉండగా సర్కారు జిల్లాల్లో 44 శాతం వున్నది. హరిత విప్లవ పూర్వం, హరిత విప్లవ కాలం, హరిత విప్లవానంతరం - ఈ మూడు దశలలో ధాన్యపు పంట వివిధ రకాలుగా వున్నది. మొదటి దశలో వరిధాన్యం సాగుచేయు విస్తీర్ణంలో పెరుగుదల రేటు సర్కారు జిల్లాలలో 2 శాతం వుండగా అది క్రమంగా తగ్గి మూడవ దశలో 1.34 శాతం చేరింది. సగటు సర్కారు జిల్లాలో ఈ విస్తీర్ణం పెరుగుదల రేటు 2.66 శాతం ఉండినది. రాయలసీమలో వరి పంట విస్తీర్ణం పెరగుదల మొదటి దశలో 2.29 ఉండగా రెండవ దశలో తగ్గి 1.87 శాతనికి చేరింది. మూడవ దశలో అసలు పెరుగుదల లేక వున్నది కూడా తగ్గి -3.72కి చేరింది. తెలంగాణా ప్రాంతంలో వరి విస్తీర్ణం మొదటి దశలో 1.51 శాతం నుండి రెండవ దశలో 1.41 శాతానికి తగ్గి మూడవ దశలో మరింత తగ్గి 0.25 శాతానికి చేరుకున్నది. ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా వరి పెరుగుదల రేటు మొదటి దశలో 1.89 ఉండగా రెండవ దశలో తగ్గి 0.93 శాతానికీ మూడవ దశలో 0.38 శాతానికీ చేరింది.

అదే విధంగా వరి ధాన్యంలో ఉత్పత్తి సర్కారు జిల్లాలలో మూడు దశలలో కూడా సగటు 2.79 శాతం ఉండగా, రాయలసీమలో 1.82 శాతం తెలంగాణాలో 0.9 1 శాతం వుంటూ రాష్ట్ర వ్యాపితంగా 2.92 శాతం ఉండినది. ఉత్పాదకతను పరిశీలించగా మూడు దశలలో కూడా సర్కారు జిల్లాలో 2.24 శాతం వుండగా రాయలసీమలో 1.76 శాతం, తెలంగాణా జిల్లాలో 3.11 శాతం. రాష్ట్ర వ్యాపితంగా 2.27 శాతంగా వున్నది. హరిత విప్లవ ఫలితంగా రాష్ట్ర వ్యాపితంగా ఉత్పాదకత మొదటి దశలో 1.47 శాతం వుండగా రెండవ దశలో 3.16 శాతం మూడవ దశలో 4.92 శాతం వుండటం గమనార్హం. వరి ధాన్యంతో పాటు మొత్తం కాయధాన్యాల పంటల విస్తీర్ణము కూడా రాష్ట్ర వ్యాపితంగా మొత్తం సాగుభూమిలో మొదటి దశలో 63.98 శాతం కాగా రెండవ దశలో 61.28 శాతానికి చేరి మూడవ దశలో 60.33 శాతం వుంది. విస్తీర్ణంలో పెరుగుదల లేదు. ఉత్పత్తి, ఉత్పాదకతలలో కొంత పెరుగుదల వుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి హరిత విప్లవం తరువాత 8.78 శాతం చొప్పున పెరిగింది. మూడవదశలో తగ్గి 3.59 శాతానికి చేరింది. ఈ పెరుగుదల సర్కారు జిల్లాలో గణనీయంగా వుండగా, రాయలసీమ తెలంగాణా ప్రాంతములో కోద్దిపాటిగా వుంది. ఈ పరిశీలన ఈ క్రింద విషయాలను స్పష్టపరుస్తూంది. ఈ కాలంలో వరితోబాటు ఆహార ధాన్యాల విస్తీర్ణంలో పెరుగుదల లేదు. కొద్దిగా తగ్గింది కూడా మొదటి దశ కంటే రెండవ దశ అయిన హరిత విప్లవ కాలంలో ఉత్పత్తి ఉత్పాదకత బాగా పెరిగింది.హరిత విప్లవానంతర కాలంలో పై పెరుగుదల రేటు నిలకడగా వుండడమో మరింత పెరగటమో కాక కుదించుకుపోతుంది. ఉత్పత్తి పెరుగుదల తాత్కాలికమైపోయింది. వ్యవసాయం గిట్టుబాటుగా వుండకపోవడమే ఈ పెరుగుదల రేటు యిలా కుదించుకుపోవడానికి మూలకారణం.

నూనె గింజలు

నూనె గింజల ఉత్పత్తి ఆంధ్రరాష్ట్రంలో సాగు భూమిలో 14.87 శాతం విస్తీర్ణంలో చేయబడుతోంది. ఒక్క వేరుశనగ మాత్రమే 10.01 శాతం విస్తీర్ణంలో పండించబడుతోంది. రాయలసీమలో ఈ పంట ప్రధానంగా వుండి సాగు భూమిలో 25 శాతము విస్తీర్ణంలో వేయబడుతోంది. సర్కారు జిల్లాలో ఇది 4.73 శాతం, తెలంగాణాలో 5.85 శాతం విస్తీర్ణంలో పండించబడుతోంది. హరిత విప్లవానంతర కాలంలో నూనె గింజల ఉత్పత్తి పెరుగుదల రేటు రాయలసీమలో 4.88 శాతం వుండగా తెలంగాణాలో అది 9.18 శాతం వుండడం గమనార్హం. మొత్తం మూడు దశలలో కూడా ఈ పెరుగుదల రాష్ట్ర వ్యాపితంగా 1.63 శాతం వుండినది. మొదటి దశలో రాష్ట్రంలో నూనెగింజల ఉత్పత్తి పెరుగుదల రేటు (మైనస్) 4.38 శాతం ఉండగా రెండవ దశలో పెద్ద మార్పు వచ్చింది. ఈ పెరుగుదల రేటు 2.84 శాతానికి చేరుకున్నది. మూడవ దశలో ఈ పెరుగుదల రేటు మరింత పెరిగింది. అన్ని ప్రాంతాలలో పెరిగింది. రాయలసీమలో 7.4 శాతం వుండగా, సర్కారు జిల్లాలో 10.71 శాతానికి పెరిగింది. సాగుభూమి విస్తీర్ణంలో పెరుగుదలతో పాటు ఉత్పత్తిలో కూడా పెరుగుదల స్పష్టంగా కనబడుతోంది. వేరుశనగ ఉత్పత్తిలో పెద్దగా ముందంజ వేయడం ఇంకా సాధించవలసి వుంది.

పేజి   1 |   2 |    

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved