17 జనవరి, 2018, బుధవారం భారతీయ కాలమానం
Font Help

ఎపిఎ ను హోంపేజీగా చేసుకోండి

Click here for Short English summary

దున్నేవాడికే భూమి: స్వాతంత్ర్యానంతరం రైతు పోరాటాలు

జమిందారీరద్దు, జాగీర్ దారీ రద్దు, ఇనాందారీ రద్దు చట్టాలను చిత్తశుద్ధితో అమలుపరచడానికై ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని జిల్లాలో రైతులు, గ్రామీణ పేదలు తమ నిరంతర పోరాటాలను నిర్వహించారు. తత్ఫలితంగా పై చట్టాలను అమలు జరపించుకోవడంతో పాటు భూములపై గరిష్ట పరిమితిని విధిస్తూను, కౌలు రైతుల బేదఖళ్ళను నిరోధిస్తూను, కౌలు రేట్లను క్రమబద్ధం చేస్తూను అనేక చట్టాలు ఆమోదించబడినవి. సవరించబడినవి.

రెండవ అధ్యాయం

50వ దశకంలో ప్రారంభమైన భూస్వామ్య వ్యతిరేకపోరాటంలోని రెండవ అధ్యాయం గత నాలుగు దశాబ్ధాల కాలంలో కొనసాగుతున్నది. అయితే భూ సంస్కరణ కౌలుదారీ చట్టం, బంజరు భూముల పంపకం ప్రజా పోరాటాల ఫలితంగా రెండు మూడు పర్యాయాలు సవరించబడినవి. ప్రతి సవరణా రైతాంగంలో భూమి లేని పేదలకు అనుగుణంగా తేబడింది. రైతుల పోరాటాలు స్ధానికంగాను రాష్ట్ర వ్యాపితంగాను అనేక విజయాలను సాధించాయి. చట్టాలను సాధించడంలో రైతుల సమరశీల, త్యాగపూర్వక పోరాటాలు కీలకమైన పాత్ర నిర్వహించినప్పటికీ ఈ చట్టాలను ఆచరణలో అమలు పరచడంలో, నీరు గార్చుతూ, నిష్ప్రయోజనం చేయడం కోసం, భూస్వామ్య వర్గదృష్టితో పని చేసే అధికార బృందం అనేక అవరోధాలను సృష్టించింది. భూస్వాములతో కుమ్మక్కై మోసపూరిత చట్టాలను సృష్టిస్తూ అనవసర వ్యాజ్యాలను పెంచుతూ కోర్టుల చుట్టూ రైతాంగాన్ని తిప్పి విసిగించడం జరిగింది. అసంఘటిత రైతాంగం ఈ స్వార్ధపర వర్గాలు సృష్టించే నిత్యనూతన కుతంత్రాలను అరికట్టడంలో, ఎదిరించడంలో అనేక ఇబ్బందులకు గురి కావలసి వచ్చింది. ఫలితంగా భూసంస్కరణల చట్టాలు ఉద్దేశించిన లక్ష్యాన్ని పూర్తిగా సాధించలేదు. లక్షలాది ఎకరాల భూమి ఉచితంగా భూమి లేని నిరుపేదలకు దక్కవలసినది అలా దక్కలేదు. భూస్వాములు కాలంలో మార్పును గమనించుతూ లక్షలాది ఎకరాల భూమిని భూసంస్కరణ చట్టాల పరిధి నుండి తప్పించడానికి బినామీ క్రయ విక్రయాల ద్వారా మొదట భూమిని దాచుకున్నారు. తరువాత క్రమంగా జాగ్రత్తగా ఆ భూములను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ ప్రక్రియ గత 3 దశాబ్దాల వరకు పెద్దగా జరిగింది. కొద్దిగానైనా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. అయినా మొత్తం మీద భూస్వామ్య వర్గ ప్రయోజనం దెబ్బ తింటూ భూకేంద్రీకరణ గణనీయంగా సన్నగిల్లింది. సన్నకారు, చిన్నకారు రైతులు వేలాది సంఖ్యలో వ్యవసాయరంగంలో ప్రవేశించారు. బంజరు సాగుదారులు, కౌలురైతులు పట్టాదారులుగా మారారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కమతాల్లో 90 శాతానికి మించిన కమతాలలో సన్నకారు, చిన్నకారు స్వంత సేద్యం చేసుకునే మామూలు రైతులే ఉన్నారు. వీరి స్వాధీనంలో సాగులోని భూమిలో సుమారు 90 శాతం ఉండటం యాదృచ్ఛికం కాదు. ఇది గత నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరంతర రైతు ఉద్యమాల సత్ఫలితం.

పేజి   12 |      

SiteMap (క్షేత్ర పటం)      Copyright(2008) Reserved